110 దగ్గర మొదలెట్టాడు.. 8కి చేరాడు

మార్నస్‌ లబుషేన్‌ క్రికెట్‌ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లబుషేన్‌ గురించి రెండు మాటల్లో చెప్పాలంటే స్టీవ్‌ స్మిత్‌ వంటి బ్యాటింగ్‌ స్టైల్‌.. విరాట్‌ కోహ్లిలా పరుగుల ప్రవాహం. గతేడాది అక్టోబర్‌లో పాకిస్తాన్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు... ఈ ఏడాది చివర్లో అదే పాక్‌ సిరీస్‌ ముగిసే సరికి టాప్‌-10లో ఉన్నాడు. ఏడాది ముగిసే సరికే ఈ ఆసీస్‌ క్రికెటర్‌ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇప్పటివరకు ఆడింది కేవలం 11 టెస్టులే. కానీ 53.53 సగటుతో 910 పరుగుల సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా తాజాగా పాక్‌తో ముగిసిన సిరీస్‌లో డేవిడ్‌ వార్నర్‌తో పోటీ పడి మరీ పరుగుల సాధించాడు. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌ల్లో 110వ స్థానంతో ఈ ఏడాది ఆటను ఆరంభించిన లబుషేన్‌.. ఏడాది ముగిసే సరికి టాప్‌ టెన్‌లో నిలిచాడు. ఈ విషయాన్ని ఐసీసీ ముఖ్యంగా ప్రస్తావిస్తూ ప్రత్యేక ట్వీట్‌ చేసింది.